మహాభారతాన్ని రాసిన వ్యాసమహర్షి కూడా ఈ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం చెప్పలేరు. ఎందుకంటే, భారతంలోని ప్రధాన పాత్రలన్నింటికీ చాలా లేయర్లు ఉంటాయి. ఫలానా వాళ్లు గొప్పవాళ్లు అని ఖచ్చితంగా చెప్పలేం. అలానే తప్పులు చేసిన ప్రతి పాత్రనూ దుర్మార్గుడు అని కూడా ముద్ర వేయలేం. తత్వశాస్త్రం దృష్ట్యా ఒక్క ముక్కలో ధర్మంగా (Karna vs Arjuna)బతకడం అంటే ఏంటో చెప్పు నాయనా అని అడగగానే “నీకు ఏది జరిగితే చాలా బాధపడతావో అదే పనిని ఇతరులకు చేయకు” అని చెప్పిన విదురుడు కంటే పెద్ద తత్వవేత్త ఎవరుంటారు. కానీ, భగవద్గీతను ఉపదేశించిన శ్రీకృష్ణ భగవానుడే అసలైన తత్వవేత్త అని చాలా మంది నమ్మడమే గాక గట్టిగా వాదిస్తారు. అంత గొప్పగా, లోతుగా, ప్రతి పాత్రకూ ఓ కారణం, ఔచిత్యం ఉన్నట్లుగా రాశారు కాబట్టే, మహాభారతం సమగ్ర సాహిత్యానికి ఓ ప్రామాణికం. హీరోలూ, విలన్లు లేరు ఈ మహాభారతంలో!
ఇప్పుడు మన ప్రధాన డిబేట్‌కు వద్దాం. వ్యక్తులను అంచనా వేయాలంటే, ముందుగా వ్యక్తిత్వాన్ని చూడాల్సిందే కదా. సో, ఇప్పుడు మనం వ్యక్తిత్వాలను పొరలుపొరలుగా చూద్దాం. కర్ణుడు పుట్టిన వెంటనే నదిలో తల్లి వదిలేస్తుంది. సూర్యుని సూచనతోనే కుంతీ దేవీ వదిలేసినప్పటికీ, క్షత్రియుడుగా పెరగాల్సిన కర్ణుడు శూద్రునిగా, సేవకునిగా పెరగాల్సి వస్తుంది. అయినప్పటికీ కురుక్షేత్ర యుద్ధంలో తన చేతికి పాండవులు చిక్కితే, అర్జునుడిని తప్ప అందర్నీ వదిలేస్తానని కర్ణుడు కుంతీ దేవికి హామీ ఇస్తాడు. అంటే, అర్జునుడు తనకు సమఉజ్జీ అని, అర్జునుడు ఉంటే కౌరవులు గెలవడం అసాధ్యమని కర్ణుడు ఎప్పుడో గ్రహించాడు. తన ముందు చేయిచాచి ఎవరు ఏది అడిగినా తన శక్తికొలది దానం ఇచ్చే కర్ణుడు, తనకి జన్మనిచ్చిన తల్లికే నలుగురు కొడుకుల ప్రాణాలను దానంగా ఇచ్చాడంటే అది ఎంత గొప్ప దానం.
ఓ సారి కర్ణుడు ఒడిలో గురువు తలపెట్టి నిద్రపోతాడు. అదే సమయంలో ఓ పురుగు కర్ణుడి తొడను కరుస్తుంది. కానీ, కొద్దిగా కదిలినా గురువుకు నిద్రాభంగం అవుతుంది కాబట్టి, ఆ నొప్పిని భరిస్తూనే ఓ పూటంతా ఉండిపోతాడు. నిద్రలేచిన గురువు కర్ణుడి సామర్థ్యాన్ని చూసి మొదట ఆశ్చర్యపడి, ఇంత బాధను భరించావంటే ఖచ్చితంగా క్షత్రియుడివే, నాకెందుకు శూద్రుడునని (Karna vs Arjuna)అబద్ధం చెప్పావని ఓ శాపమిస్తాడు. ఇందులో కర్ణుడి మంచితనమేగానీ, చెడ్డదనం ఎక్కడుంది. అయినా శాపానికి గురయ్యారంటే, కర్ణుడి ఓటమి కోసం విధి పన్నిన విష వలయం తప్ప ఏమనుకోవాలి?
తల్లికే కుమారుల ప్రాణాలను దానంగా ఇచ్చిన కర్ణుడి మీద తండ్రి సూర్యునికి విపరీతమైన అభిమానం. ఎట్టి పరిస్థితుల్లోనూ భవిష్యత్తు కర్మలను ఎవరికీ చెప్పకూడని సూర్యుడు కూడా కుమారుడి మీద ప్రేమతో, కర్ణుడి ప్రాణాలను కాపాడటం కోసం ఓ నిజాన్నీ చెబుతాడు. “నాయనా కర్ణా, నీకున్న కవచ కుండలాలు సామాన్యమైనవి కావు. అవి ఉంటే నిన్ను ముల్లోకాలలోనూ ఎవరూ చంపలేరు. ఇదే నీకు వరం. నిన్ను చంపలేరు తప్ప నిన్ను ఓడించలేరని కాదు. కానీ నువ్వు బతికి ఉంటే కదా ఏది అనుభవించాలన్నా. కానీ నిన్ను చంపాలనే కుట్రతో ఇంద్రుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి నీకు కవచ కుండలాలు అడుగుతాడు. నువ్వు మాత్రం ఇవ్వకు” అని అంటాడు.
అప్పుడు కర్ణుడు చాలా గంభీరమైన సమాధానమిస్తాడు. “సూర్యోపాసనకు ముందు వృద్ధులు, మహిళలు, పిల్లలు, బ్రాహ్మణులు ఎవరు ఏది అడిగినా ఇవ్వడం నా వ్రతం, అది నా ధర్మం. అలా అని నా శక్తికి మించి ఇచ్చేస్తానని కాదు. నా శక్తిమేరకు ఇస్తాను. అంతటి వ్రతాన్ని భగ్నం చేసుకుని బతకడం నా వల్ల కాదు. నాకు కీర్తి కాంక్ష ఎక్కువ. కీర్తి కోసం ప్రాణాలు వదిలేస్తాను. పోతే పోనీ ఈ ప్రాణాలు. అపకీర్తిని మాత్రం మూటగట్టుకోలేను” అని అంటాడు. ఇంతటి క్రమశిక్షణ, సంకల్ప దీక్ష ఉన్న కర్ణుడు, ప్రాణాలు పోతాయని తెలిసి కూడా కవచకుండలాలు (Karna vs Arjuna)ఇవ్వడానికి సిద్ధపడ్డాడంటే ఏం గుండె అది… ఆ గుండె కలియుగంలోనూ బతకాల్సిందే! అంత నిష్టగా వ్రతాన్ని ఆచరించాలంటే, ఎంత గొప్ప మానసిక దారుఢ్యం ఉండాలి.
అయితే, సూర్యుడు వెళ్లిపోయే ముందు, “సరే, వాటికి ప్రతిగా శక్తి ఆయుధాన్ని ఇంద్రుడి వద్ద నుండి తీసుకో నాయనా” అని సలహా ఇస్తాడు. కాకపోతే, పైన చెప్పిన గురువు శాపం వల్ల యుద్ధం సమయంలో నేర్చుకున్న విద్యలు, అస్త్రాలు పనికిరాకుండా పోవడం వల్ల ఈ శక్తి ఆయుధం పనిచేయకుండా పోతుంది. ఇక్కడ మరో యాదృశ్చికమైన విషయం ఏంటంటే, తన అంశతో పుట్టిన అర్జునుడిని రక్షించుకోవాలని ఇంద్రుడు ప్రయత్నిస్తే, కర్ణుడిని రక్షించుకోవాలని సూర్యుడు ప్రయత్నించడం. పుత్రవాత్సల్యం ఏదైనా చేయిస్తుంది. చివరికి దుర్యోధునుడి దుష్టకర్మలను ధృతరాష్ట్రుడు సహించేలా కూడా చేయగలదు.
యుద్ధంలో కర్ణుడి పరాక్రమం అంతా ఇంతా కాదు. రెచ్చగొట్టిన ధర్మరాజుని పిడిగుద్దులతో మట్టికరిపించి, “బతికి పో” అని ప్రాణాలు దానంగా ఇచ్చేసిన తర్వాత, కర్ణుడి ఆవేశాన్ని చూసి నకులుడు, సహదేవుడు, భీముడు భీతిల్లిపోతారు. వాళ్లు ముగ్గురూ ఓ రథం ఎక్కి యుద్ధం చేస్తుంటే, కర్ణుడు ఒక్కడే వాళ్ల ముగ్గురి మీదకీ లంఘించి, కురుక్షేత్ర సంగ్రామంలో పెడబొబ్బలు పెట్టిస్తాడు. ఆ సమయంలో కర్ణుడి కోపాన్నీ, ఉద్ధృతనూ చూసి అర్జునుడు భయపడి… కృష్ణా, అటువైపు రథాన్ని తీసుకెళ్లకు, ఈ సమయంలో అక్కడికి వెళ్తే కర్ణుడి చేతిలో నా చావు తప్పదు అని భయపడిపోతాడు. ఓవైపు అన్నదమ్ములు ప్రాణాల కోసం పోరాడుతున్నా సరే, అర్జునుడు (Karna vs Arjuna)వారిని కాపాడాలనే ఆలోచన లేకుండా వెనుకడుగు వేస్తాడు.
శత్రువుల గుండెల్లో పరుగులు పెట్టించేంత పరాక్రమం కర్ణుడి సొంతం. కర్ణుడు ఒక్కటే బతికి ఉంటే, కురుక్షేత్రం ఈ రోజు వరకూ జరిగి ఉండేదని నమ్మేంత శౌర్యం, శక్తి, పరాక్రమం ఉంది కాబట్టే, కర్ణుడిని నమ్ముకుని దుర్యోధనుడు యుద్ధానికి వెళ్తాడు. కర్ణుడే లేకపోయి ఉంటే, అసలు కురుక్షేత్రమే ఉండేది కాదు. రాజులు మధ్య రాజీ మాత్రమే ఉండేది. ధర్మసంస్థాపన జరిగేదే కాదు.
మరోవైపు అర్జునుడు గురించి కూడా చూద్దాం. అర్జునుడు మామూలు విలుకాడు కాదు. ఏదైనా నేర్చుకోవాలనే పట్టుదల ఉన్న వ్యక్తి. గురువు మెప్పుపొందడం కోసం, ఎంతైనా శ్రమిస్తాడు. ఓసారి అర్జునుడికి ద్రోణాచార్యుడు మాట ఇస్తాడు. ప్రపంచంలో అత్యంత గొప్ప ధనుర్‌విద్యాప్రపూర్ణుడుని చేస్తాను అని చెబుతాడు. అదే సమయంలో ఏకలవ్యుడు తనకు తెలియని విద్యను ప్రదర్శించేసరికి మనసంతా అసూయతో నిండిపోయింది. గురూజీ మీరు మాట తప్పారు అని మొహం మీదనే అనేశాడు. ఆ అలక వల్లనే ఏకలవ్యుడి బొటనవేలు తెగిపోయే పరిస్థితి వచ్చింది.
ఇక అర్జునుడి యుద్ధపరాక్రమం మామూలుది కాదు. ఎదురుగా ఉన్నవాడు ఎట్టిపరిస్థితుల్లోనూ చంపదగిన శత్రువే అని నమ్మాడంటే, చంపేంత వరకూ కంటిరెప్ప కూడా కదలనివ్వని తీక్షణత అర్జునుడి సొంతం. దుర్యోధనుడు చిన్నప్పటి నుండీ అర్జునుడిని చూస్తున్నాడు కాబట్టే, అర్జునుడిని ఓడించడానికి తనకు ఓ వీరుడు కావాలని ఆలోచించాడే గానీ, తానే అర్జునుడిని ఓడించగలను అని ఎప్పుడూ నమ్మలేదు. ఓసారి కర్ణుడితో తలపడినప్పుడు, మొత్తం రథాన్ని బాణాలతో బంధించేశాడు. పైనుండి చూస్తే బోనులో చిక్కుకున్న ఎలుకలాగా కర్ణుడు కనిపించాడు. అదే అస్త్రాన్ని తర్వాత కర్ణుడు కూడా అర్జునుడి మీదకి వదిలాడు. దాన్ని ఓ పులిలాగా ఛేదించుకుని వచ్చి మళ్లీ సంగ్రామంలో అర్జునుడు, కర్ణుడులు పాల్గొంటారు. వీళ్లిద్దరూ యుద్ధం చేస్తుంటే, పాక్-భారత్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి సగటు ప్రేక్షకులు వెళ్లినట్లే, దేవతలు అందరూ వచ్చి చూసేవాళ్లంట. అంత పరాక్రమంతో, రాజీ లేకుండా యుద్ధం చేసే వీరులు. యుద్ధవిద్యలలో అర్జునుడు ఉన్నత స్థానంలో ఉన్నా, యుద్ధం చేసే వేగంలో మాత్రం కర్ణుడు స్థాయి చాలా ఉన్నతంగా ఉండేది.
మరి, ఇంత దాన, వీర, శూర కర్ణుడిలో లోపాలు లేవా అంటే… ఉన్నాయి. చాలా ఉన్నాయి. కర్ణుడి కంఠానికి అర్జునుడు గాంఢీవాన్ని గురి పెట్టేంత వరకూ కర్ణుడు పాటించినది అధర్మమే. ఆ ఘటనలేంటో చెప్పుకుందాం. ఓ సారి ద్రోణాచార్యుడు తన శిష్యులందరికీ విద్య ప్రదర్శన నిర్వహిస్తాడు. ఆ సమయంలో కర్ణుడు చీటికిమాటికీ నేను బలప్రదర్శన చేస్తాను, నా బలప్రదర్శన చూడాల్సిందే అంటే.. బాబూ, ఇది బలప్రదర్శన కాదు, విద్యాప్రదర్శన. అంటే తమకు వచ్చిన అస్త్రాలను ప్రదర్శించి చూపాలి అని ద్రోణుడు చెప్పినప్పటికీ… కర్ణుడు అహంకారంతో వ్యవహరించి గురువు కోపానికి గురవుతాడు.
ఇంత దుర్మార్గుడుగా పేరు సంపాదించిన దుర్యోధనుడు… పాచికలాటలో పాండవులు ఓడిపోతే, కేవలం ద్రౌపదిని సభకు తీసుకురమ్మంటాడు. కానీ, కర్ణుడు మాత్రమే ఆమెకు వస్త్రాపహరణం చేయాలని సలహా ఇస్తాడు. ఇంత కన్నా దారుణం ఏముంటుంది? అసలు దుర్యోధనుడి ధైర్యమే కర్ణుడు. కర్ణుడు సై అంటే యుద్ధానికి వెనుకాముందూ ఆలోచించకుండా బయలుదేరే మనిషి దుర్యోధనుడు. ఓసారి గంధర్వుల మీద యుద్ధానికి వెళ్దామని కర్ణుడే సలహా ఇస్తాడు. ఆ యుద్ధంలో ఘోర పరాభావం ఎదుర్కొంటాడు. అర్జునుడిని చంపాలంటే (Karna vs Arjuna) తాను బతికి ఉండాలని చెప్పి, దుర్యోధనుడిని సంగ్రామం మధ్యలోనే వదిలేసి పారిపోతాడు. స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడన్న సోయి కూడా కర్ణుడికి ఉండదు. కానీ చరిత్రలో స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చాడని చెప్పుకుంటారు, కానీ ఇది నిజం కాదేమోనని అనిపిస్తుంది. చాలా యుద్ధాలలో ఇలానే కర్ణుడు పారిపోయాడు. ఈ యుద్ధంలో అర్జునుడే గెలుస్తాడు.
కర్ణుడికి కీర్తి కాంక్ష ఉందన్నది మనం ఇదివరకే చెప్పుకున్నాం. కానీ, కాస్తంత కీర్తి కండూతి కూడా ఉందేమోనని కొన్ని విషయాలు చూస్తే అర్థమవుతుంది. భీష్ముడు ఉన్నంత వరకూ యుద్ధం చేయనని అహం ప్రదర్శిస్తాడు. భీష్ముడు నేలకొరిగిన తర్వాతనే యుద్ధ రంగంలోకి దిగుతాడు. కానీ, తన కళ్లముందున్న బంధువులు, సోదరులు, స్నేహితులను చంపడం ఇష్టం లేక, రాజ్యం వద్దులే అని ప్రారంభంలోనే వెనక్కి వెళ్లిపోయేంత దయ కలిగినవాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు, అర్జునుడిని పిలిచి, ధర్మసంస్థాపనలో భాగం కావాలని హితబోధ చేస్తాడు. దాంతో మళ్లీ యుద్ధం తదుపరి దశకు వెళ్తుంది.
అలానే ద్రుపద రాజ్యం మీదకి కూడా కౌరవులు వెళ్తారు. ఆ యుద్ధంలో కర్ణుడు ఓడిపోతాడు. కానీ అర్జునుడు, అంటే పాండవులు ద్రుపద రాజ్యం మీద గెలుస్తారు. మరోసారి యుద్ధంలో, అర్జునుడు అంటే పగతో రగిలిపోయే తక్షకుడు, కర్ణుడు చేతి మీదకి పాకి, నన్ను నీ బాణంలో పెట్టి అర్జునుడి మీదకి వదులు. నేను సంహరిస్తాను అని చెబుతాడు. అప్పుడు కర్ణుడు కోపంగా, నువ్వా వాడిని చంపేది, నేనే చంపాలి. పోరా పక్కకి అని నెట్టేస్తాడు. దీన్ని అహంకారం అనుకోవాలో, తాను మాత్రమే చంపాలనే సంకల్పం అనుకోవాలో అర్థం కాదు.
ఇకపోతే మనసును కలచివేసే విషయమేంటంటే, అర్జునుడి కుమారుడు అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకుంటాడు. కౌరవులను చీల్చిచెండాడుతున్న అభిమన్యుడి చావుకు కారణం కర్ణుడు. చిన్నపిల్లలకు ఏదడిగినా దానం ఇచ్చిన కర్ణుడు, అభిమన్యుడి మీద మాత్రం ఎటువంటి జాలి లేకుండా చంపేస్తాడు. ఈ కారణాన్ని చెప్పే కర్ణుడి మీద యుద్ధానికి అర్జునుడిని శ్రీకృష్ణుడు ఉసిగొల్పుతాడు. అయితే, ఇలాంటి ఘటనే కర్ణుడికి కూడా జరిగింది. కర్ణుడు పాండవులను పరుగులు పెట్టిస్తున్నాడు. కృష్ణుడు, హనుమంతుడు నడిపిస్తున్న రథానికి కూడా ఆటుపోట్లు తప్పట్లేదు. కర్ణుడి మీదకు వెళ్తున్న అర్జునుడిని చంపడానికి కర్ణుడి కొడుకు వస్తాడు.
ఒకే ఒక్క వేటుకు కర్ణుడి కుమారుడి తలను అర్జునుడు తెంచుతాడు. ఆ ఘటన చూసిన తర్వాత, అప్పటిదాకా హోరుగా యుద్ధం చేస్తున్న కర్ణుడు నీరుగారిపోతాడు. అంత కోపంలోనూ, ఆగ్రహంలోనూ కుమారుడి తలను చూస్తూనే శత్రువుల మీద విరుచుకుపడుతుంటాడు. ఇక కర్ణుడి దగ్గరకు రథం వెళ్తుంది. యుద్ధం తారస్థాయిలో ఉండగా, మట్టిలో రథం కూరుకుపోతుంది. దీనికి కూడా శాపమే కారణం. ఇంతటి వీరుడూ, శూరుడూ అయిన కర్ణుడు కురుక్షేత్రంలో ఓ సామాన్య మానవునిలాగా మాట్లాడిన ఘటన ఏదైనా ఉందంటే, అది ఆ క్షణమే. “అర్జునా, ధర్మం కాబట్టి నీకు ఈ మాట చెబుతున్నాను. నేను నిరాధాయుడిని అయినప్పుడు నన్ను చంపడం భావ్యమా, కాస్త సమయం ఇవ్వు, నా రథ చక్రాన్ని బయటకు తీస్తాను” అని అంటాడు.
అప్పుడు కృష్ణుడు బయటకు వచ్చి, ఇప్పుడు ధర్మం గుర్తొచ్చిందా కర్ణా, గుక్కతిప్పుకోకుండా గత కొద్దిరోజులుగా నువ్వు పాటించిన ధర్మాలేంటో చెప్పు అని అడిగేసరికి, కర్ణుడు మౌనం వహిస్తాడు. అప్పుడు అర్జునుడికి కృష్ణుడు ఆదేశాలు ఇస్తాడు. అర్జునా, అది కర్ణుడి శాపం, ఆ రథం లేవదు. ఆలోచించకుండా బాణం వెయ్యు అంటాడు. అప్పుడు అర్జునుడు, తాను ధర్మాన్నే పాటించినవాడినైతే, గురువులను గౌరవించినవాడినైతే నా ఆయుధం కర్ణుడి తలను వేరు చేయుగాక అని చెప్పి బాణం విడుస్తాడు. ఓ వైపు తల, మరోవైపు మొండెం పడిపోతాయి. ఎప్పుడైతే నేలమీద కర్ణుడి తల పడుతుందో, అదే సమయంలో బురుదలో కూరుకున్న రథచక్రం స్వయంగా పైకి లేస్తుంది.
ఏదైతే ఏంటి, కర్ణుడిని చంపింది అర్జునుడే కదా. సో, అర్జునుడే గ్రేట్ కదా అని మనం అనుకోవచ్చు. కానీ, యుద్ధంలో ఎన్నోసార్లు అర్జునుడిని కృష్ణుడే కాపాడుతాడు. లేకపోయుంటే ఎప్పుడో మరణించేవాడు. ఓ సారి రథాన్ని కిందికి దిగిపోయేలా చేసి, బాణం అర్జునుడి తలకు తగలకుండా చూస్తాడు. యుద్ధం అయిపోయిన తర్వాత, “అర్జునా రథం దిగు” అని ఆదేశిస్తాడు. ఇలా దిగిన వెంటనే రథం భగభగమని మంటల్లో కాలిపోతుంది. కృష్ణుడే లేకపోయి ఉంటే ఆ రథం కొద్ది రోజుల ముందే కాలిపోయేది. ఇలా అడుగడుగునా కృష్ణుడు ఉండబట్టే అర్జునుడు బతికాడు.
చివర్లో కర్ణుడు కొడుకు, పసివాడైన వృషకేతుడుని అర్జునుడే సంరక్షించి, ప్రేమగా పెంచుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, అర్జునుడే గొప్పవాడా…. లేక కర్ణుడు గొప్పవాడా… ధర్మసంస్థాపన కోసం వీళ్లిద్దర్నీ వాడుకున్న కృష్ణపరమాత్ముడా? కౌరవుల పక్షాన కర్ణుడే లేకపోతే అసలు కురుక్షేత్ర యుద్ధమే జరిగే అవకాశం లేదని చాలా మంది వ్యాసమహర్షి భారతాన్ని చదివినవాళ్లు అంటుంటారు. మీరేమంటారో కామెంట్లలో తెలపండి.